ఈ రోజుల్లో ఎంతో మంది కుంగుబాటుకు గురౌతున్నారు. దీనికి హడావుడిగా ఉరుకులు పరుగుల జీవితం, అనారోగ్యకరమైన జీవనశైలి, హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, జీవితంలో జరిగే బాధాకరమైన అనుభవాలను ఎలా సంభాళించాలో తెలియకపోవడం మొదలైన అనేక కారణాలు ఉండొచ్చు. కుంగుబాటు లక్షణాలు అందరిల ఒకేలా ఉండవు, వ్యక్తులను బట్టి, కుంగుబాటు తీవ్రతను బట్టి మారుతుంటాయి. కుంగుబాటు అనేది దానిని అనుభవించే వ్యక్తికి, తన చుట్టూ ఉన్నవారికీ చాలా ఇబ్బందికరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా వయసుతో నిమిత్తం లేకుండా దాదాపు 3 కోట్ల మంది కుంగుబాాటుతో బాధ పడుతున్నారు.
శుభ వార్త: యోగ, ధ్యానము, మంచి పౌష్టిక ఆహారం తీసుకోవటం లాంటి చిన్న, సులువైన ప్రయత్నాలతోమన జీవన శైలి మార్చుకుంటే, అది కుంగుబాటు సమస్యను అధిగమించడానికి సహకరిస్తుంది. ఈ సూత్రం ఎలా పని చేస్తుంది? ఆయుర్వేదం ప్రకారం, కుంగుబాటు అనేది మన శరీరం, మనస్సులలో ప్రాణ శక్తి తక్కువైందనటానికి సూచన. ప్రాణ శక్తి ద్వారా మనకు ఉత్సాహం, ఆనందం, శాంతి లభిస్తాయి. ప్రతి నిత్యం యోగ, ప్రాణాయామం చేయటం ద్వారా ప్రాణ శక్తి పెరిగి తద్వారా కుంగుబాటు ఛాయలు తొలగిపోతాయి. కుంగుబాటులో ఉన్న మనిషికి యోగా చేయటం వలనఉపశమనం కలుగుతుందని అనేక శాస్త్ర పరిశోధనలు కూడా చెబుతున్నాయి.
కుంగుబాటునుండి కోలుకొనే దశలో ఉన్నవారికి, ఆశావహ దృక్పథం, ఇంకా విశ్వాసం ఉండటం చాలా ముఖ్యం. గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్ మాటల్లో చెప్పాలంటే, “జీవితం అనేది ఆనందము, బాధల కలయిక. కష్టం అనేది అనివార్యం కానీ దానివలన మీరు బాధపడటం అనేది మీ ఐచ్ఛికం. జీవితం పట్ల విశాలమైన దృష్టి కలిగి ఉంటే కష్టతర సమయాల్లో ముందడుగు వేసే సామర్థ్యం వస్తుంది. ఈ ప్రపంచంలో మీ అవసరం ఎంతైనా ఉందని మీరు తెలుసుకోవాలి. అనంత అవకాశాలను కలిగి ఉన్న ఈ జీవితం మీ ఒక్కరికే కాకుండా, అందరికీ సంతోషాన్ని, ఆనందాన్ని పంచే ఒక బహుమతిగా ఉండాలి.“
కుంగుబాటును తగ్గించే యోగాసనాలు
శిశు ఆసనం

- సుదీర్ఘమైన విశ్రాంతినిస్తుంది
- నాడీ వ్యవస్థకు ఉపశమనం కలిగించి, ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది
హలాసనం

- నాడీ వ్యవస్థకు ఉపశమనం కలిగించి, ఒత్తిడిని, అలసటను తగ్గిస్తుంది
- థైరాయిడ్ (వినాళ) గ్రంథిని ప్రేరేపించి, మీలోని శక్తి స్థాయి, మానసిక స్థితి మెరుగు పడుటకు సహకరిస్తుంది
శవాసనం

- ప్రగాఢమైన ధ్యానపు విశ్రాంతిని కలిగిస్తుంది తద్వారా కుంగుబాటుకు ప్రధాన కారణమైన ఒత్తిడిని తొలగిస్తుంది
- వాత దోషం తగ్గటానికి సహకరిస్తుంది – వాయు మూలకం అసమతుల్యత వలన మీరు కుంగుబాటును, ఆందోళనను అనుభవిస్తారు
- చైతన్యం నింపటానికీ నూతనోత్సాహానికి సహకరిస్తుంది
అధో ముఖ శ్వానాశనం

- శరీరానికి శక్తిని, చైతన్యాన్ని కలిగిస్తుంది
- మెదడుకు రక్త ప్రసరణను పెంచుతుంది, తద్వారా మానసిక స్థితి మెరుగు పడటానికి సహకారం లభిస్తుంది
- తల నొప్పి, నిద్రలేమి, అలసటల నుంచి విముక్తికి సహకరిస్తుంది
సేతు బంధాసనం

- మెదడుకు ఉపశమనం కలిగించి, ఆందోళనను, ఒత్తిడిని తగ్గిస్తుంది
- ఊపిరి తిత్తులను వ్యాకోచింపజేస్తుంది. నిస్పృహనీ మానసిక స్థితిని దెబ్బతీసే వినాళ (థైరాయిడ్) గ్రంథికి సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది
శ్వాస వ్యాయామాలు
శ్వాస వ్యాయామాలు ఇంకా ప్రాణాయామాలు, కుంగుబాటును అధిగమించడానికి సమర్థవంతమైన పద్ధతులు.
భ్రమరి ప్రాణాయామం
- ఆందోళకరమైన మనస్సుకి ప్రశాంతత లభించేందుకు సహకరిస్తుంది
- ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది
నాడి శోధన ప్రాణాయామం

- మనస్సుని ప్రస్తుతానికి తెచ్చేందుకు సహకరించి, భవిష్యత్తు గురించి గతం గురించి ఉండే అనవసర ఆలోచనలని తొలగిస్తుంది
- నాడులను శుద్ధి చేయడానికి సహకరిస్తుంది. తద్వారా ప్రాణ శక్తి ప్రసరణ సవ్యంగా జరుగుతుంది
- నిస్పృహని పారద్రోలటం, పేరుకుపోయి ఉన్న ఒత్తిడి నుంచి విముక్తి కలగటం జరుగుతుంది
సుదర్శన క్రియతో పాటు చేసే శ్వాస ప్రక్రియల సాధన ద్వారా వ్యక్తులకు కుంగుబాటు నుండి మంచి ఉపశమనం కలిగినట్లు డజనుకు పైగా ప్రచురితమైన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ అధ్యయనాల ప్రకారం నిస్పృహ ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ఉపశమనంలో 67-73% విజయం సాధించినట్లు కనపడుతోంది.
కొన్ని అదనపు చిట్కాలు
- సంఘ సేవలో పాలు పంచుకోండి: ‘నాకు (ప్రయోజనం) ఏంటి’ అనే నిస్తేజమైన స్థితి నుంచి బయటపడటానికి ‘సమాజానికి నేను ఏమి చెయ్యగలను?’ అనే ఆలోచన ద్వారా, సమాజానికి పెద్ద మేలు జరిగే కార్యక్రమంలో పాలుపంచుకోవడం వంటి పనుల వలన, మీ జీవితపు దశ మారి, ముందడుగు వేస్తారు.
- మీరు ఏమి భుజిస్తారో అదే మీరు: మీ ఆహారంలో ఏమి భుజిస్తున్నారనేది కూడా చాలా ముఖ్యం. మంచి ప్రాణ శక్తి ఉన్న ఆరోగ్యకరమైన పదార్థాలు మనస్సుకీ దేహానికీ మంచివి.
- కొన్ని కీర్తనలను సాధన చేయండి: భజనలు, కీర్తనలు మీ ప్రాణశక్తిని పెంచేందుకు, మనస్సుకి ప్రశాంతతను కలిగించేందుకు సహకరిస్తాయి.
- యోగ వలన శరీరానికీ మనస్సుకూ ఎన్నో ప్రయోజనాలు కలిగేందుకు సహకరిస్తుంది. అయినప్పటికీ, ఇది ఔషధాలకు ప్రత్యామ్నాయం కాదు. యోగాసనాలను నేర్చుకొని సాధన చేయటం అనేది సరైన శిక్షణ పొందిన శ్రీ శ్రీ యోగ శిక్షకుల పర్యవేక్షణలో జరగటం ముఖ్యం. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు, వైదులను, శ్రీ శ్రీ యోగ శిక్షకులను సంప్రదించి, ఆ ప్రకారం యోగాసనాలను సాధన చేయండి.









