ధ్యానం

ఏది మీకు లోతైన విశ్రాంతిని కలిగిస్తుందో అది ధ్యానం

ధ్యానం అంటే ఏమిటి?

పూర్తి విశ్రాంతిలో ఉంటూ, అదే సమయంలో పూర్తి అప్రమత్తంగా, ఎఱుకలో ఉండేందుకు మార్గం ధ్యానం! మనసును శాంతపరచి, మీ అంతర్గత ఆనందాన్ని స్పృశించగలిగే నైపుణ్యం ధ్యానం. ధ్యానం అంటే ఏమీ చేయకుండా ఉండే సున్నితమైన కళ. శ్రమను అంతటినీ వదిలేసి మీ సహజ స్వభావమైన ప్రేమలో, ఆనందంలో, శాంతిలో విశ్రాంతిగా ఉండే కళ. ధ్యానాన్ని సాధన చేసినపుడు మీకు లోతైన విశ్రాంతి లభిస్తుంది. ఒత్తిడిని తగ్గించుకుని మానసిక స్వచ్ఛతను కాపాడుకోవడం చాలా అవసరం.

ధ్యానం అనేది శబ్దం నుండి నిశ్శబ్దానికి, కదలిక నుండి నిశ్చలతలోకి చేసే ప్రయాణం. ఆత్మకు ఆహారం ధ్యానం. భావోద్వేగాలకు సంగీతం, బుద్ధికి జ్ఞానం, మనస్సుకు వినోదం ఎలాగో, అదేవిధంగా మన ఆత్మకు లేదా చైతన్యానికి ధ్యానం ఆహారం.

ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం - ప్రశాంతమైన మనస్సు, కేంద్రీకృతమైన ధ్యాస, మెరుగైన ఏకాగ్రత, ఆలోచనలు, భావాలలో స్పష్టత, ఒత్తిడితో కూడిన పరిస్థితులలో బావోద్వేగాలను సమతుల్యంగా ఉంచుకునే సామర్థ్యం, మెరుగైన సంభాషణా చాతుర్యం కలుగుతాయి. కొత్త నైపుణ్యాలు, ప్రతిభలు వికసిస్తాయి. ఎవరూ కదిలించలేని అంతర్గత స్థైర్యం కలుగుతుంది. బాధలను నయం చేసే శక్తి వస్తుంది. మీలో అంతర్గతంగా ఉన్న శక్తిని వెలికితీసి ఉపయోగించుకోగలుగుతారు. పూర్ణమైన విశ్రాంతి వలన శరీరం, మనసు పునరుత్తేజాన్ని పొందుతాయి. ధ్యానం అదృష్టాన్ని కూడా కలిగిస్తుంది. క్రమం తప్పకుండా ధ్యానాన్ని సాధన చేస్తే ఇవన్నీ సహజంగా కలిగే ప్రభావాలు.

  • ధ్యానం వల్ల మొదటి ప్రయోజనం ఏమిటంటే అది మన శరీరంలో, వ్యవస్థలో జీవశక్తిని మెరుగుపరుస్తుంది. మీరు గమనించారా, కొన్నిసార్లు మీరు ఎవరినైనా కలిసినప్పుడు, వారు మీకు పరిచయస్తులైనా సరే, ఆ సమయంలో ఏ కారణమూ లేకున్నా, వారితో మాట్లాడాలనిపించదు. అయితే మరికొందరిని, మీరు తరచుగా కలవకపోయినా సరే, చూడగానే వారితో సాన్నిహిత్యం ఉన్నట్లు అనిపిస్తుంది. వారి వద్ద మీకు సుఖంగా అనిపిస్తుంది. దీనికి కారణం సకారాత్మకత (పాజిటివ్ ఎనర్జీ). ధ్యానం మన చుట్టూ సానుకూలమైన, సామరస్యమైన శక్తిని సృష్టిస్తుంది.
  • ధ్యానం వలన కలిగే రెండవ ప్రయోజనం, మెరుగైన శారీరక ఆరోగ్యం. ధ్యానం వలన మానసిక ఒత్తిడి, మధుమేహం, గుండె జబ్బులు, చర్మ వ్యాధులు, నాడీసంబంధ సమస్యలు మొదలైన అనేక సమస్యలు ఏవిధంగా తగ్గుతాయనే విషయంపై ఈరోజు అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.
  • ఇక మూడవది, ఒక ఆహ్లాదకరమైన మానసిక స్థితిలో ఉండేందుకు ధ్యానం సహాయపడుతుంది. అనేక మానసిక, శారీరక సమస్యలను నివారించడంలో ఇది ప్రధానపాత్ర పోషిస్తుంది.

కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు, ధ్యానం ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. మనల్ని వర్తమాన క్షణంలో ఉండటానికి సహాయపడుతుంది. మనస్సు గతానికి, భవిష్యత్తుకు మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది. గతాన్ని గురించి (ఆలోచిస్తూ) మనం కోపంగా ఉంటాము, లేదా భవిష్యత్తు గురించి ఆత్రుతగా ఉంటాము. మనస్సు ఇలా గతం, భవిష్యత్తు మధ్య ఊగిసలాడకుండా వర్తమానంలో ఎక్కువసేపు ఉండేందుకు ధ్యానం సహాయపడుతుంది.

కొత్తగా నేర్చుకునేవారికోసం ధ్యానం

ధ్యానం చేయడం అనేది శ్వాస పీల్చి, వదిలేసినంత సులభం. దీనికోసం మీరు కొండలెక్కి, గుహలలో దాక్కోవలసిన అవసరం లేదు. ఇది మీ రోజువారీ జీవితంలో సులభంగా చేర్చగలిగే ఉత్సాహభరితమైన ప్రక్రియ. ధ్యానం లో అనేక రకాలు ఉన్నాయి. వాటిలోనుండి ఏ రకమైన ధ్యానాన్ని అయినా మీరు ఎంచుకోవచ్చు - శ్రమ పడకుండా వర్తమాన క్షణానికి చేరుకోవడంలో అవి మీకు సహాయపడతాయి.

నిజానికి, మొట్టమొదటిసారి ధ్యానం చేసినప్పుడు కలిగే అద్భుతమైన ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేమని చాలామంది అంటారు. మీరు ధ్యానం నేర్చుకుని, క్రమం తప్పకుండా రోజుకు ఒకటి రెండు సార్లు సాధన చేస్తున్నపుడు మీ అంతరంగంలో, బాహ్యంగా ఒక పరివర్తన కలగడాన్ని గమనిస్తారు. అది ఎలా ఉంటుందంటే, మీరు ఎక్కడ ఉన్నాసరే మీలో ఉరకలేసే ఆ శక్తిని మీ చుట్టూ ఉన్నవారు గుర్తించగలుగుతారు. కాబట్టి, జీవితంలో ఒత్తిడి లేకుండా, సంతోషంగా ఉండటానికి ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కొద్ది నిమిషాలు తప్పక ధ్యానం చేయాలి.

నేను ఈ కోర్సు చేయాలనుకుంటున్నాను, కానీ...

నా మనసు అన్నిచోట్లకూ తిరుగుతోంది. మరి ధ్యానం ఎలా చేసేది?

గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్: ఒక కర్ర తీసుకొని మీ మనస్సు వెంటపడి తరమండి. అది ఎక్కడికి వెళుతుందో చూడండి. దాన్ని అలసిపోయేదాకా అలా తరుముతూ వెంటాడండి. అపుడది పరుగెత్తి పరుగెత్తి అలసిపోయి మీ కాళ్ల వద్ద పడిపోతుంది. ప్రతీదానిపైనా ధ్యానం చేయమని పతంజలి మహర్షి అంటారు. పంచభూతాలను ధ్యానించండి, ఏ కోరికలూ లేని ఋషులను ధ్యానించండి. కోరికలనుండి బయటపడిన మహర్షులను ధ్యానించినప్పుడు, మీరు ధ్యానంలోకి వెళ్లిపోతారు. మీరు సత్సంగానికి కూర్చున్నప్పుడు కూడా ధ్యానంలోకి వెడడతారు. అయితే, మీరు గనుక 100% సంపూర్ణంగా సత్సంగానికి కూర్చోకపోతే, మీరు పైకీ, కిందకూ, అటూ ఇటూ దిక్కులు చూస్తూ ఉంటారు. కాబట్టి (సత్సంగం కోసం) ఆసక్తిని మీరే తెచ్చుకోవాలి. రసాస్వాదన చేసేందుకు కావలసిన రసాన్ని మీరే తెచ్చుకోవాలి. అది సిద్ధంగా ఉంది, మీరు చేయవలసినదల్లా, మీ వెనుక (నడిపిస్తున్న శక్తిని) చూడటమే. మీరు ఏమీ చేయనవసరం లేదని నేను చెప్తున్నాను, మీలోపల అది జ్వలిస్తోంది. దాన్ని ప్రత్యేకంగా ఇప్పుడు వెలిగించాల్సిన అవసరం లేదు. మీరు గంగానదిలో దిగి స్నానం చేస్తున్నప్పుడు, మీకు కుళాయి, లేదా షవర్ ఎందుకు? అప్రయత్నంగా అవ్వండి. ‘నేను ఏమీ కాదు, నాకు ఏమీ అక్కర్లేదు’ అని తెలుసుకోండి చాలు. కానీ దాని గురించి కూడా అదేపనిగా ఆలోచించకండి. అది కూడా ఒక మాయ. అందుకే నేను శూన్యం అని అనుకోవడం కూడా మూర్ఖత్వమే అని ఆదిశంకరాచార్యులు అన్నారు.

ఆలోచనలు ఎందుకు వస్తాయి? ఎక్కడ నుండి వస్తాయి? అవి మనల్ని ఎందుకు శాసిస్తాయి?

గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్: ఆలోచనలు ఎక్కడ నుండి వస్తాయి? మనస్సులో నుండా? లేక శరీరం నుండా? కళ్ళు మూసుకుని దీని గురించి ఆలోచించండి. అదే ధ్యానం అవుతుంది. అప్పుడు, మీలోపల ఎక్కడినుండి, ఏ ప్రాంతంనుండి ఆ ఆలోచనలు వస్తున్నాయో, అక్కడకు చేరుకుంటారు. అది అద్భుతంగా ఉంటుంది.

ధ్యానంలో మన అనుభవాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి?

గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్: మీకు ధ్యానంలో మంచి అనుభవాలు కలుగకపోతే, ఎక్కువ సేవ చేయండి. తద్వారా మీకు యోగ్యత కలుగుతుంది, మీ ధ్యానం కూడా మరింత లోతుగా జరుగుతుంది. మీరు మీ సేవ ద్వారా ఎవరికైనా కొంత ఉపశమనాన్ని లేదా స్వేచ్ఛను అందించినప్పుడు, మీకు మంచి ప్రకంపనలు, ఆశీస్సులు లభిస్తాయి. సేవ మీకు యోగ్యతను కలిగిస్తుంది; యోగ్యత మిమ్మల్ని ధ్యానంలో లోతుగా వెళ్ళడానికి వీలు కల్పిస్తుంది. ధ్యానం వల్ల మీ చిరునవ్వు తిరిగి వస్తుంది. అపుడు ధ్యానం యొక్క ఉత్తమ ప్రభావాలను మీరు అనుభవించవచ్చు

నేను ఎప్పుడూ ధ్యానం చేస్తూనే నిద్రపోతాను. అందరికీ ఇలాగే జరుగుతుందా? వారికి ఎలాంటి అనుభవం ఉంది? దీన్ని ఎలా పరిష్కరించాలి?

గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్: ఇతరుల అనుభవాల గురించి చింతించకండి. మీ స్వంత అనుభవంతో ఉండండి. అనుభవాలు కూడా కాలంతోబాటు మారుతూ ఉంటాయి. కాబట్టి చింతించకండి. ధ్యానం యొక్క ప్రక్రియ ఉత్తమమైన శారీరక విశ్రాంతికి సహాయపడుతుంది.

నిద్రకు, ధ్యానానికి తేడా ఏమిటి?

Gurudev Sri Sri Ravi Shankar: It does not matter! Don’t lose heart! Let them come! Say, “Come, sit with me, five-year-old, or ten-year-old, or twenty-year-old memories. Come! Sit with me.” The more you want to run away from them, the more they will bother you.

నేను ధ్యానానికి కూర్చున్నప్పుడు పాత జ్ఞాపకాలు నన్ను ఎందుకు బాధపెడతాయి?

గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్: మరేం పర్వాలేదు! ధైర్యం కోల్పోవద్దు! వాటిని రానివ్వండి! వాటిని ఆహ్వానించండి, “రండి, నాతో కూర్చోండి, ఐదేళ్ల, పదేళ్ల, లేదా ఇరవై ఏళ్ల జ్ఞాపకాలు. రండి! నాతో కూర్చోండి.” అని చెప్పండి. మీరు వాటి నుండి పారిపోవాలని ప్రయత్నించినకొద్దీ అవి మిమ్మల్ని మరింత ఇబ్బంది పెడతాయి.