ఆందోళన మరియు ఒత్తిడి నుండి ఉపశమనం పొందండం ఇప్పుడు చాలా సులభం. ఒక్క యోగాసనం దూరంలో మాత్రమే ఉంది.
ఒత్తిడి, భయం, ఆందోళన – వీటిని లెక్కలేనన్నిసార్లు మనం అనుభవించాము. పరీక్ష ఫలితం గురించిన ఆందోళన, రిపోర్ట్ కార్డు చూసినపుడు మన తల్లిదండ్రుల స్పందన ఎలా ఉంటుందో అని ఆందోళన, ఉద్యోగానికి ఇంటర్వ్యూ, లేదా మొదటిసారి ప్రేమలో పడినప్పుడు కలిగే ఆందోళన. మనందరం ఇలాంటి క్షణాలను అనుభవించే ఉంటాము. కొంచెం భయం ఉండటం సాధారణమే. నిజానికి, మనం క్రమశిక్షణతో, ఏకాగ్రతతో, క్రియాశీలకంగా ఉండడానికి, ఆహారంలో ఉప్ప్పు లాగా ఇది కొంచెం అవసరం.
ఎప్పుడైతే భయం నిరంతరం మన దైనందిన జీవితంలో అడ్డు తగులుతూ ఉంటుందో అప్పుడు సమస్య మొదలవుతుంది. అప్పుడు అది ఆందోళన రుగ్మత అవుతుంది. అధికమైన అశాంతి, బాధ, తెలియని భయం ఉండే పరిస్థితి అది. వీటికి చికిత్స అవసరం. ఇక్కడే మీకు యోగా సహాయం చేస్తుంది. ఆ ఆందోళనను సులభంగా అధిగమించేందుకు సహాయపడుతుంది.
అయితే, యోగా ఒక్కటే దీనికి చికిత్సగా భావించకూడదని మీరు తెలుసుకుంటే మంచిది. మీ డాక్టర్ తో గానీ, నిపుణులతో గానీ సంప్రదించి, సరియైన మందులతో పాటు యోగా చేయడం మంచిది. ఎందుకంటే భయం, అవాంఛిత ఆలోచనలు, శారీరక, మానసిక గాయాలు, సామాజిక ఆందోళన, లేదా సాధారణ మైన రుగ్మతేనా అనే విషయాన్ని అర్థం చేసుకుని వైద్యులు మీకు మార్గదర్శనం చేస్తారు.
నోట్: అల్లోపతి మందుల వలన దుష్ప్రభావాలు కలగవచ్చు. హోమియోపతి, లేదా ఆయుర్వేద చికిత్సలకు వెళ్ళవచ్చు.
మీకు ఆందోళన రుగ్మత ఉందని తెలిపే లక్షణాలు:
- అసాధారణమైన భయం, అస్థిమితంగా ఉండడం
- గతంలో కలిగిన అనుభవాలను గురించి నియంత్రణ లేకుండా ఆలోచనలు రావడం
- తరచూ పీడకలల వలన నిద్ర మేల్కోవడం
- పదే పదే చేతులు కడుక్కోవడం
- నిద్ర సరిగా పట్టకపోవడం
- కాళ్ళు, చేతులలో అసాధారణంగా చెమట పట్టడం
- తరచుగా గుండె దడదడలాడటం
ఆందోళనను అధిగమించడానికి యోగా ఎలా సహాయపడుతుంది?
క్రమమైన యోగ సాధన దైనందిన జీవితంలో ప్రశాంతతను, విశ్రాంతిని ఇస్తుంది. ఇంకా జీవితంలో ఎదురయ్యే సంఘటనలకు, కలవరపడకుండా ఎదుర్కొనే బలాన్నిస్తుంది. యోగ సాధనలో ఆసనాలు (శరీర భంగిమలు), ప్రాణాయమాలు (శ్వాస క్రియలు), ధ్యానం, ప్రాచీన యోగ తత్త్వం ఇవన్నీ కలిపి చాలా మంది ఆందోళన బారిన పడిన రోగులు కోలుకోవడానికి, సానుకూల దృక్పథంతో ఎదుర్కోవడానికి సహాయపడ్డాయి.
సుషమ గోయల్ అనే గృహిణి తన అనుభవాన్ని ఇలా పంచుకున్నది – ” నేను ఎప్పుడూ చిన్న చిన్న విషయాలకే ఆందోళన పడుతూ, వ్యాకులత చెందేదాన్ని. ప్రతీ చిన్న లేదా పెద్ద సంఘటనకు కదిలిపోయేదాన్ని. నా భర్త డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లినప్పుడు వారు నాకు సాధారణమైన ఆందోళన రుగ్మత ఉందని చెప్పారు. ఆరునెలల వరకు ఆందోళనకు చికిత్స తీసుకుంటూనే యోగా, ధ్యానం క్రమం తప్పకుండా సాధన చేశాను. ఈరోజు నాకు క్రొత్త జన్మనెత్తినట్టుంది. నా ఆలోచనా విధానం మారింది. ఏది జరిగినా మంచికే జరుగుతుందని నమ్మకం కలిగి ఉన్నాను. భవిష్యత్తు గురించి ఏ మాత్రం భయపడడం లేదు. యోగా నాకు ఈ బలాన్నిచ్చింది.” సుషమ లాగే మీరు కూడా యోగాతో ఒక సానుకూల జీవితానికి, భయాన్ని అధిగమించడానికి స్వాగతం చెప్పగలరు.
కలవరపడే మనసుకు ప్రశాంతతను కలిగించి, ఆందోళనను సహజంగా తగ్గించే చికిత్సకు ఈ క్రింది యోగా విధానాలు సహాయపడుతాయి.
- యోగాసనాలు చేసి మనసుపై ఒత్తిడినుండి ఉపశమనం పొందండి.
- ఆందోళనను తగ్గించడానికి శ్వాస ప్రాణాయామాలు చేయండి
- ధ్యానం చేసి ప్రశాంతమైన మనస్సును కానుకగా పొంది ఆనందించండి
- యోగా తత్వాన్ని జీవితానికి అన్వయించుకుని ప్రతి ఒక్క క్షణాన్నిఆనందించండి.
- ప్రార్ధించండి, నమ్మకముంచండి, చిరునవ్వుతో ఉండండి.
- ఇతరుల కోసం మీరేం చేయగలరో ఆలోచించండి.
- ప్రపంచం యొక్క అశాశ్వతత్త్వాన్ని తెలుసుకోండి.
- ఆందోళనను అధిగమించడానికి గతంలో జరిగిన ఇలాంటి సందర్భాన్ని గుర్తు తెచ్చుకోండి.
- సానుకూల దృక్పధం ఉన్నవారిని మీచుట్టూ ఉంచుకోండి.
1. యోగాసనాలు చేయండి మరియు మీ మనస్సును ఒత్తిడి నుండి విముక్తి చేయండి
ఈ క్రింద చెప్పబడిన యోగా భంగిమలు ఆనందకరమైన, ఆరోగ్యకరమైన శరీరాన్ని, మనస్సును పొందడానికి సహాయపడుతాయి. ఆసనాలు మన వ్యవస్థ నుండి ఉద్రిక్తతను, ప్రతికూల భావోద్వేగాలను బయటకు విడుదల చేయడానికి సహాయపడుతాయి.
- ధనురాసనం
- మత్స్యాసనం
- జాను శీర్షాసనం
- సేతు బంధాసనం
- మార్జరీ ఆసనం
- పశ్చిమోత్తాసనం
- హఠ పాదాసనం
- అధోముఖాశ్వాసనం
- శీర్షాసనం
- శవాసనం
నోట్: శరీరానికి, మనసుకు విశ్రాంతినివ్వడానికి యోగాసనాల చివరిలో కొన్ని నిమిషాల పాటు క్రింద పడుకుని యోగ నిద్ర చేయాలి. ఈ విధానం ఒత్తిడికి ప్రాథమిక కారణాలైన విషతుల్య మలినాలను బయటకు పంపించడానికి సహాయపడుతుంది.
2. ఆందోళన నుండి విముక్తి పొందడానికి ప్రాణాయామాల ద్వారా శ్వాసను సరిగ్గా తీసుకోవడం
మీ ఏకాగ్రతను శ్వాస దగ్గరికి తీసికెళ్ళడం ద్వారా ఒత్తిడిని కలిగించే అనవసరమైన, అస్తవ్యస్తమైన ఆలోచనల నుండి మనస్సుకు స్వేచ్ఛ కలిగించవచ్చు. క్రింద చెప్పిన శ్వాస పద్దతులను ప్రయత్నించండి:
- కపాలభాతి ప్రాణాయామం
- భస్త్రిక ప్రాణాయామం
- నాడీ శోధన ప్రాణాయామం
- భ్రామరీ ప్రాణాయామం
3. విశ్రాంతితో కూడిన మనస్సును కానుకగా పొంది ఆనందించడానికి ధ్యానం చేయండి
ధ్యానం పరధ్యానంగా ఉన్న మనస్సుకు విశ్రాంతి కలిగిస్తూ ప్రశాంతమైన భావనను కలిగించే అద్భుతమైన ప్రక్రియ. రోజూ ధ్యానం చేస్తూ ఉంటే మీ చుట్టు ప్రక్కల జరిగే చిన్న చిన్న విషయాలకు మీ మనస్సు ఎలా స్పందిస్తుందో అవగాహన కలుగుతుంది. తెలియని భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆందోళన చెందకుండా, దాని నుండి విముక్తి చెందడానికి సహాయపడుతుంది.
మీరు తరచుగా “అడ్రినలిన్ రష్” అనే పదం వినే ఉంటారు. మనం ఏదైనా గట్టి బెదిరింపు గురించి ఆందోళన చెందినపుడు, లేదా దేనినైనా హటాత్తుగా ఎదుర్కోవలసివచ్చినపుడు ఇది సంభవిస్తుంది. ఉదాహరణకు ఒక సాహసం చేసేటప్పుడు అడ్రినలిన్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల మన గుండె వేగంగా కొట్టుకుంటుంది. కండరాలు బిగుసుకుంటాయి విపరీతమైన చెమట పడుతుంది. ప్రతి నిత్యం చేసే ధ్యాన సాధన ఈ ఒత్తిడి హార్మోన్ స్థాయిలను గణనీయంగా తగ్గించడంలో సహాయపడుతుందని శాస్త్రీయ పరిశోధనలు చూపిస్తున్నాయి.
4. యోగా తత్వాన్ని జీవితానికి అన్నయించుకోండి ఆనందంగా ఉండండి. ప్రతి క్షణాన్నీ ఆస్వాదించండి.
సాధారణమైనవే అయినా ఎంతో లోతైన ప్రాచీన యోగా సూత్రాలకు (యమ, నియమాలు) సంబంధించి నిత్య జీవిత జ్ఞానాన్ని తెలుసుకోవడం, అమలుపరచడం అనేవి మనం సంతోషంగా ఉండడానికి, ఆరోగ్యమైన జీవితం గడపడంలో ఉండే రహస్యం కావచ్చు.
ఉదాహరణకు సంతోష అనే సూత్రం (నియమ) సంతృప్తి యొక్క విలువను బోధిస్తుంది. అపరిగ్రహ సూత్రం ఒత్తిడికి, ఆందోళనకు కారణమయ్యే అత్యాశను, మరింత ఎక్కువ స్వంతం చేసుకోవాలనే కోరికను అధిగమించడంలో సహాయపడుతుంది. ఇంకా శౌచ సూత్రం మనస్సు, శరీరం యొక్క పరిశుభ్రతను గురించి మాట్లాడుతుంది. ముఖ్యంగా అంటువ్యాధులు వస్తాయేమోనని చాలా ఎక్కువగా ఆందోళనగా ఉన్నప్పుడు ఈ సూత్రం సహాయపడగలదు.
ప్రధానంగా ఆందోళన, ఒత్తిడిని అధిగమించడానికి దోహదపడే పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుని జీవితాన్ని ఆనందంగా జీవించడానికి కూడా యోగసూత్రాలలోని యమ, నియమాలు సహాయం చేస్తాయి.
యోగా తత్త్వాన్ని అర్థం చేసుకోవడానికి గురుదేవులు శ్రీశ్రీ రవిశంకర్ గారి “పతంజలి యోగా సూత్రాలు” వ్యాఖ్యానాన్ని చదవచ్చు.
5. ప్రార్థించండి, నమ్మకముంచండి. చిరునవ్వుతో ఉండండి
ప్రార్ధన అనేది ఆందోళనను తొలగించి, ఉత్తమమైన భరోసాను, మద్దతును ఇస్తుంది. రోజూ ప్రార్ధన, జపం, భజన చేయడం (భక్తి గీతాలు పాడటం) లాంటి అలవాట్లు మిమ్మల్ని సానుకూల శక్తితో నింపుతాయ, మనసు చలించకుండా సహాయపడుతాయి. జరిగేదంతా మంచికోసమే, మనకంటే అధికమైన దైవశక్తి మనల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నది అనే ఒక గాఢమైన నమ్మకాన్ని కలిగిస్తాయి. దానివలన మనం మరింత ప్రశాంతంగా, చిరునవ్వుతో ఉండడానికి ఎఱుకతో కూడిన ప్రయత్నం చేస్తాము. అది మనలోనమ్మకం, ప్రశాంతతను, సానుకూల దృక్పథాన్ని తక్షణమే కలిగిస్తుంది. కాబట్టి దీనిని ఇప్పుడే ప్రయత్నించండి.
6. ఇతరుల కోసం మీరు ఏం చేయగలరో ఆలోచించండి
ఎప్పుడైతే మనం తరచుగా `నేను, నాది’ అనే భావనలో ఇరుక్కుపోతామో అప్పుడు ఒత్తిడికి, ఆందోళనకు స్థలం దొరుకుతుంది. మనకు ఏమి జరుగుతుందో అని విచారపడుతూ ఉంటాము. అలాకాకుండా మీ ఏకాగ్రతను చుట్టుప్రక్కల ఉన్నవాళ్లకు ఎంతో కొంత సహాయపడే విధంగా మార్చండి. కొంత సేవా కార్యక్రమాలతో మిమ్మల్ని మీరు శక్తివంతంగా ఉంచుకుంటే లోతైన తృప్తి మరియు అపారమైన ఆనందం కలుగుతుంది.
7. ఈ ప్రపంచం యొక్క అశాశ్వతత్త్వాన్ని తెలుసుకోండి
ఎపుడైతే మన చుట్టు ప్రక్కల ఉన్న ప్రతిదీ అశాశ్వతం, మారుతూ ఉంటుంది అన్న సాక్షాత్కరము మనకు కలుగుతుందో, అప్పుడు మనం విశ్రాంతిగా, మన లోలోపల స్థిరపడతాము.
“ఇది కూడా వెళ్ళిపోతుంది, ఎప్పటికీ ఇదే ఉండిపోదు” అనే భావన మనలో ఉదయించినప్పుడు ఆందోళన నుండి స్వేచ్ఛను పొందుతాము. ఈ వ్యవస్థాపక సూత్రాన్ని గ్రహించడంలో మనకు ధ్యానం సహాయపడుతుంది.
8. గతంలో ఇలాంటి ఒత్తిడిని అధిగమించిన పరిస్థితిని గుర్తు తెచ్చుకోండి
ఈ పరిస్థితిని కూడా మీరు దాటుతారనే అపారమైన ధైర్యాన్ని ఆ జ్ఞాపకం నింపుతుంది. తరచుగా మీకు మీరే దీన్ని గుర్తు చేసుకుంటూ ఉండండి.
9. మీ చుట్టూ అనుకూలమైన సహచరులను ఉంచుకోండి
మీరు ఎక్కువ సమయం సానూకూల మనస్సు ఉన్న ప్రజలతో గడిపినట్లైతే అలాంటి ఆలోచనలతోనే ప్రభావితమవుతారు. ఇది మీ జీవితం మొత్తం వైఖరిలో ప్రతిబింబిస్తుంది. సానుకూలమైన మనస్సు మాత్రమే ఆనందాన్ని, శాంతిని, విశ్రాంతిని మీలో కలిగించగలదు.











