ఎవరినైనా సంతోషంగా ఉంచే బాధ్యత మీపై ఉన్నదనుకోండి, అపుడు మీరు ఆ పనిలో తీరికలేకుండా ఉంటారు. అపుడు మీరు కూడా సంతోషంగా ఉంటారు. కానీ, మీరు ఒక్కరే సంతోషంగా ఉండాలనుకున్నపుడు, ఆ సంతోెషంతోబాటు కుంగుబాటు కూడా కచ్చితంగా వస్తుంది.
కుంగుబాటు (నిస్పృహ) కు మంత్రం ఏమంటే, “నా గతి ఏంటి, నాకేంటి ప్రయోజనం?” (అనే ఆలోచనే). దానికి బదులుగా, అందరికీ ఉత్తేజాన్ని కలిగించే వాతావరణాన్ని సృష్టించేందుకు మీరు బాధ్యత తీసుకోవాలి.
సేవ చేసే ధోరణి, మీ నిస్పృహ నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. ‘సమాజానికి నేను ఏమి చెయ్యగలను?’ అనే ఆలోచన, ఓ పెద్ద సామాజిక మేలుకోసం జరిగే కార్యక్రమంలో పాలుపంచుకోవడం వంటి పనుల వలన మీ జీవితపు దశ మారి ‘నా గతి ఏంటి?’ అనే ఊబి నుంచి బయటపడగలరు. సేవా దృక్పథం, త్యాగ బుద్ధి, పరస్పర సహకారం వంటి విలువలు పాతుకుపోయి ఉన్న సమాజాలలో నిస్పృహ, ఆత్మహత్య లాంటివి కలుగవు.
నిస్పృహ అనేది జీవితం పట్ల నిస్తేజమైన ఆలోచన ఉన్న స్థితి. ఎప్పుడైతే జీవితం శూన్యమై, నిస్తేజమై, ఇక ఏమీ లేదు, ఎక్కడికీ వెళ్ళేది లేదు అనే స్థితి ఉన్నపుడు అప్పుడు మీరు నిస్పృహ చెందినట్లే.
ఎప్పుడైతే ప్రాణశక్తి తగ్గిపోతుందో, అప్పుడు మీరు కుంగిపోతారు. ఎప్పుడైతే ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుందో, అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. సరైన విధంగా తీసుకొనే శ్వాస, వ్యాయామం, కొద్దిపాటి ధ్యానం, ఇంకా మంచి ప్రేమపూర్వకమైన సహచరులు ఉంటే, జీవశక్తి పెరగవచ్చు.
పెద్ద విషయాల గురించి దిగులుపడండి
మీ జీవితాన్ని ఒకసారి చూడండి. ఈ భూమి మీద మీ జీవితం 80 సంవత్సరాలు అనుకుందాం, దానిలో 40 సంవత్సరాలు నిద్రకు, విశ్రాంతికి గడిచిపోతుంది, పది ఏళ్ళు స్నానపు గదుల్లో, కాలకృత్యాల్లోకి పోతుంది. ఎనిమిది ఏళ్ళు తినడం, తాగడంలోకి పోతుంది. ఇంకో రెండు ఏళ్ళు ట్రాఫిక్ జామ్ లలో గడచిపోతుంది. జీవితం ఇలా పరిగెడుతుంటే, అకస్మాత్తుగా ఓ రోజు మెలకువ వచ్చినపుడు ఇదంతా ఓ కలలా అనిపిస్తుంది. మీకు ఇలాంటి ఒక విశాలమైన దృష్టి ఉన్నపుడు, చిన్నచిన్న విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు.
మనము దిగులు పడే విషయాలు చాలా చిన్నవి. ఈ భూమి ఎందుకు వేడెక్కుతోంది అని మనము ఎప్పుడైనా దిగులు పడతామా?
ఒక చిన్న దుమ్ము కళిక చాలు అనంతమైన మీ కంటి చూపుని చెదరగొట్టడానికి.. అదే విధంగా మీలోన ఎంతో నిధి ఉంది, చిన్నచిన్న విషయాలు మీ మనస్సుని చెదరగొడుతుంటాయి.
కానీ, మనకు విశాలమైన దృష్టి ఉంటే, మీరు చిన్న సమస్యలను సవాలుగా తీసుకుంటారు. మీరు పెద్ద సవాళ్ల గురించి ఆలోచిస్తూ, ఈ ప్రపంచాన్ని ఒక ఆటమైదానంలా చూస్తారు. ఒక బాధ్యత లాంటి భావన కలుగుతుంది. విచక్షణ మీలో ఉదయించి, తరువాతి తరాలకు మంచి వాతావరణాన్ని ఎలా కల్పించాలనే ఆలోచన మీరు చేస్తారు.
మీకు జీవితం అర్థరహితంగా అనిపిస్తే, మీలోన శూన్య భావన కలుగుతుంది, అప్పుడు మీకు నిస్పృహ కలిగినట్లే. ఇదొక జటిలమైన సమస్య. బ్రిటన్ దేశంలో, 18% మంది ఒంటరితనంతో, కుంగుబాటుతో బాధపడుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి అక్కడ ఒక మంత్రినే ఏర్పాటు చేసారు.
ఈ మధ్య ప్రపంచ ఆర్ధిక సదస్సు (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్) చెప్పిన ప్రకారం కుంగుబాటు అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రజల మానసిక ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతోంది. వ్యాపార సమాజం సైతం దీన్ని గమనించడం ఆహ్వానించదగ్గ విషయం.
ఈనాటి యువతకు ఆదర్శవాదం లేకపోవటం అనేది కుంగుబాటుకు ప్రధాన కారణం. ఈ పోటీ ప్రపంచం వలన కలిగే భయం, లేదా అసాధ్యాలను సాధించాలనే వ్యామోహంలో కూరుకుపోవటం వల్ల ఈనాటి పిల్లలకు జీవితం అర్థరహితంగా కనిపిస్తోంది. వాళ్లకు సరైన ప్రేరణ కావాలి. అటువంటి ప్రేరణ ఆధ్యాత్మికత వలన సాధ్యమవుతుంది.
విషాదాలతో పోరాడండి
నిస్పృహకి విరుగుడు దూకుడుతనం. పోరాడే ఉత్సాహం లేనప్పుడు కుంగుబాటు వచ్చిపడుతుంది. కుంగుబాటు అంటే ప్రాణశక్తి లేకపోవటం. దూకుడు, కోపము అనేవి అదుపులేని శక్తికి సంకేతాలు. భగవద్గీతలో అర్జునుడు కుంగిపోయినపుడు, కృష్ణుడు పోరాటపటిమను నింపి అర్జునుడిని పునరుద్దరించినాడు. మీరు నిస్పృహకి గురైనపుడు, ఏదైనా ఒక మంచి కారణం కోసం పోరాడండి, అది ఏదైనా పర్వాలేదు. అయితే ఆ ఉద్రేకం, దూకుడు శృతి మించితే అది మళ్ళీ నిస్పృహకి దారితీస్తుంది. చక్రవర్తి అశోకుడికి ఇదే జరిగింది, కళింగ యుద్ధం గెలిచినా కూడా నిస్పృహకి లోనైనాడు. అప్పుడు బుద్ధుడిని ఆశ్రయించక తప్పలేదు.
తెలివైనవారు ఉద్వేగానికి గాని, కుంగుబాటుకు గాని లోనుకారు. ఇది యోగులకు తారకమంత్రం. కాబట్టి, మేలుకోండి. మీరు కూడా యోగులే అని గ్రహించండి.
ధ్యానం, సేవ, జ్ఞానం, విచక్షణల ద్వారా మన ఆత్మను, మనలోనిఉత్సాహాన్ని వృద్ధి పొందించడమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత ద్వారా కుంగుబాటును జయించవచ్చు.
గతంలో, యువతకు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. వారికి ఈ ప్రపంచం మొత్తాన్ని శోధించాలనే ఆలోచన ఉండేది. సాధించేందుకు లక్ష్యాలు ఉండేవి. ఈనాడు యువతకు ఎటువంటి శ్రమ లేకుండానే అటువంటి అనుభవాలు చిటికెలో లభ్యం అవుతున్నాయి. అంతర్జాలం ద్వారా వారికి అవసరమైనవన్నీ లభిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే చిన్న పిల్లలు సైతం ప్రపంచాన్ని చూసివచ్చినవారివలే మాట్లాడుతున్నారు.
వారి ఇంద్రియాలు, మనసు తట్టుకోగలిగినవాటికంటే చాలా ఎక్కువ అనుభవాలను వారు చాలా త్వరితంగా అందుకుంటున్నారు. దీని పర్యవసానం ఏమంటే, ఎంత త్వరగా వాటిని స్వీకరిస్తున్నారో, అంతే త్వరగా ఇవన్నీ భ్రమలని కూడా తెలుసుకుంటున్నారు. వాళ్లందరినీ సరైన దారిలో పెడితే, వారు ఇంకా బాగా తెలుసుకొని మరింత సృజనాత్మకంగా తయారవుతారు. వారికి సరైన దారి చూపకపోతే వారు చిన్న వయసులోనే దుడుకుగా తయారవటం, లేదా కుంగుబాటుకు లోనవటం జరుగుతుంది.
కొద్దిపాటి ఆధ్యాత్మికత అనుభవం, విలువలతో కూడిన విద్యతో పాటు స్థితమైన మానవ విలువలు, అన్ని కలిపితే అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవే కరువైనపుడు యువత చాలాసార్లు వ్యసనాలకు బానిసలౌతారు. నిస్పృహ, దూకుడుతనం, సంఘ వ్యతిరేక ఆలోచనలు వేళ్లూనుకుంటాయి.
ఒంటరితనాన్ని పరమానందంగా మార్చుకోండి
ఒంటరితనం అంటే సంస్కృతంలో ఏకాంతం, అంటే ‘ఒంటరితనానికి అంతం’. మనతో ఉండేవారిని మార్చినంత మాత్రాన మన ఒంటరితనం మాయమైపోదు. మనతో ఉన్నవారికంటే మరింత సహృదయులు, మనల్ని అర్థం చేసుకునేవారితో కలసిఉన్నంత మాత్రాన మన ఒంటితనం పోదు. మీరు మీ ప్రాకృతిక స్వభావాన్ని అవగతం చేసుకున్నప్పుడే మీ ఒంటరితనం అంతం అవుతుంది. ఆధ్యాత్మికపరమైన ఓదార్పు మాత్రమే మిమ్మల్ని బాధలు, నిరాశ నుంచి బయట పడేయగలదు.
ఐశ్వర్యం, మెప్పు ఇంకా చెప్పాలంటే బాహ్య ప్రపంచం ఇచ్చే ధ్రువీకరణలు, ప్రశంసలు మన లోపల ఉన్న అసంతృప్తిని తీర్చలేవు. మీలోనే ఉన్న, మీరై ఉన్న ఘనీభవించిన నిశ్శబ్దంగా భాసిల్లే, ఉప్పెనంత ఆనందo కలిగిన, అనంతత్వానికి సూక్ష్మ స్వరూపమైన, మీదైన వేరే లోకంతో సంబంధం ఏర్పరచుకోవటం ద్వారా మీ బాధలకు వీడ్కోలు పలకొచ్చు. మీరు చేయవలసినదల్లా, ఆ శక్తిని స్వీకరించటమే.
యంత్రాన్ని ఎలా నడపాలో తెలిపే వివరణపత్రం మీవద్ద లేనపుడు ఆ యంత్రం మీవద్ద ఉన్నా ఉపయోగం ఉండదు. ఆధ్యాత్మికత జ్ఞానo అనేది మీ జీవితానికి ఒక వివరణపత్రం లాంటిది. ఎలాగైతే ఒక వాహనం నడపడం కోసం, స్టీరింగ్ చక్రం, క్లచ్, బ్రేకులు మొదలైనవాటిని వాడేవిధానం తెలుసుకోవటం ఎలా అవసరమో, అదేవిధంగా మనసును సుస్థిరంగా ఉంచడానికి మన జీవితపు ప్రాణశక్తిని గురించిన ప్రాథమిక సూత్రాలను తెలుసుకోవాలి. ఇదే ప్రాణాయామం యొక్క సంపూర్ణ శాస్త్రం.
ఎప్పుడైతే మన ప్రాణ శక్తిలో నిలకడ లోపిస్తుందో, మన మనస్సులోని భావాలు కూడా ఎగుడుదిగుడుగా భ్రమిస్తూ ఉంటాయి. మనసుస్థాయిలో మనసును అదుపుచేయలేము. అనుకూలమైన ఆలోచనల మీద బలవంతంగా దృష్టి నిలపటం మాత్రమే పనిచేయదు. పైగా అది కొన్ని సార్లు వ్యతిరేకఫలితాన్ని కూడా ఇవ్వవచ్చు.
కుంగుబాటు నుంచి బయటపడటానికి వాడే మందులు మొదట్లో బాగా పనిచేసినా దీర్ఘకాలంలో అవి మనిషిని వాటి మీదే ఆధారపడేలా చేస్తాయి. సరిగ్గా ఇలాంటప్పుడే శ్వాస యొక్క రహస్యమును తెలుసుకుని, ఆచరిస్తే అది జీవితాన్ని సమూలంగా మార్చగలదు.
సుదర్శన క్రియ లాంటి శ్వాస ప్రక్రియల ద్వారా ప్రాణ శక్తిని, తత్ఫలితంగా మనస్సుని స్థిరపరచడo జరుగుతుంది. నిరంతరo ధ్యాన సాధన చేయడo ద్వారా మనలో నూతన కోణాన్ని ఆవిష్కృతం చేయడమే కాకుండా, దాని ప్రభావం క్రమంగా మన జీవితంలోని అన్ని అంశాలపైనా ప్రసరిస్తుంది.
ఆత్మహత్య ఎందుకు పరిష్కారం కాదు
జీవితo అనేది సుఖ దుఃఖాల కలయిక. కష్టాలు అనివార్యం, కానీ వాటి వల్లపడటం అనేది మన చేతుల్లో ఉంది. విశాల దృక్పథంతో ఉంటే కష్టాలను సులువుగా జయించే బలం చేకూరుతుంది. ఈ ప్రపంచానికి మీరు అవసరం అన్న నిజాన్ని గ్రహించండి. అనంత అవకాశాలతో, మీ జీవితం మీ ఒక్కరికే కాదు, అది అందరికీ సంతోషము, ఆనందాల కలయికతో వెల్లివిరిసే ఒక బహుమతి.
ప్రజలు దుస్థితి నుంచి తప్పించుకోవడానికి ఆత్మ హత్య చేసుకోవడం జరుగుతోంది, కానీ దాని వలన వారు ఇంకా పెద్ద దుస్థితిలోకి వెళుతున్నారు. ఇది ఎలాగంటే, చలితో వణుకుతున్న వారు ఆరుబయటకు వెళ్లి, తాను కప్పుకున్న దుప్పటిని తీసివేయడం లాంటిదే. చలి తగ్గుతుందా అప్పుడు?
జీవితంపై చాలా ఎక్కువ వ్యామోహాన్ని, బంధాన్ని పెంచుకున్నవారే ఆత్మ హత్య స్థాయికి చేరుకుంటారు. వారు ఏదో ఒక ఆనందానికి, సంతోషానికి దాసులైపోయారు, అందువల్లే వారు తమను తాము అంతం చేసుకుంటారు. కాని వారు అలా తమనుతామే అంతం చేసుకుంటారో, అప్పుడే, తాము మరింత దుర్భరమైన స్థితిలోకి వెళ్లిపోతున్నామని తెలుసుకుంటారు. “ఓరి దేవుడా, ఈ చంచలత్వం, ఈ కోరికల వలన కలిగిన తీవ్రమైన వేదన ఇంకా తొలగిపోలేదు, శరీరం పోయినా బాధ ఇంకా మిగిలేవుంది.” అని వారికీ అనిపిస్తుంది.
ఈ శరీరం ద్వారా మాత్రమే మీ బాధను, వేదనను మీరు తరిమేయగలరు. ఇంకా చెప్పాలంటే, (ఆత్మహత్య ద్వారా) మీ బాధలను జయించే సాధనాన్ని మీరే నాశనం చేస్తున్నారు. మీలో ప్రాణశక్తి తగ్గిపోయినపుడు, మీరు కుంగుబాటుకు గురవుతారు, అదే మరికొంచెం తగ్గితే ఆత్మ హత్య ఆలోచనలు వస్తాయి. ప్రాణ శక్తి బాగా ఉంటే, ఇటువంటి ఆలోచనలు రావు. ప్రాణ శక్తి హెచ్చుగా ఉన్నప్పుడు మీరు మీకు గాని, ఇతరులకు గాని హాని చేయరు. సరైన శ్వాస వ్యాయామాల ద్వారా, ధ్యానము ఇంకా సత్సంగము ద్వారా ప్రాణశక్తి వృద్ధి చెందుతుంది.
ఎవరైనా ఆత్మ హత్య ఆలోచనలు చేస్తున్నవారు ఉంటే, వారిని వెంటనే శ్వాస వ్యాయామాలు చేయించగలిగి, ధ్యానం నేర్పించగలిగి తద్వారా ప్రాణ శక్తిని పెంచగల సరైన శిక్షకుల వద్దకు తీసుకెళ్లండి. ప్రతి రోజూ, పది నిముషాలు ధ్యానం చేసి, శూన్యంలోకి వెళ్లిపోండి. మనము హింస లేని, ఒత్తిడి లేని సమాజాన్ని నిర్మించాలంటే ధ్యానము ఒక్కటే మార్గం. చాలా సార్లు, మనము ధ్యానానికి కూర్చున్నపుడు, మనస్సు ఎన్నో రకాలుగా విహరిస్తుంది. అటువంటి సమయాలలో, సుదర్శన క్రియ అనే శ్వాస ప్రక్రియ ద్వారా, దానికి తోడు యోగ సహాయపడతాయి. వీటిద్వారా మనస్సు స్థిరమై నిర్మలమవును.
మీకు ఆత్మ హత్య ఆలోచనలు వస్తున్నాయి అంటే ఇవి గుర్తు పెట్టుకోండి.
1. మీలో ప్రాణ శక్తి తక్కువగా ఉందని తెలుసుకోండి, ప్రాణాయామం బాగా చేయండి.
2. ఎన్నో కోట్ల మంది ఎన్నో రకాలుగా అవస్థలు పడుతున్నారన్న విషయం తెలుసుకోండి. మీకు మీ ఆవేదన చిన్నగా కనిపించినప్పుడు, మీరు ఆత్మహత్య గురుంచి ఆలోచించరు.
3. మీరు ఈ ప్రపంచానికి అవసరము, ఉపయోగము అన్న విషయం తెలుసుకోండి. మీరు ఎదో చేయడానికే ఈ భూమికి వచ్చారు.
ప్రజలు ఏమనుకుంటారో అనే విషయాన్ని మర్చిపోండి: ప్రజలు వాళ్ళ పరువు, హోదా కోల్పాయామని అనుకుని ఆత్మ హత్య చేసుకుంటారు. హోదా అంటే? పరువు అంటే? మీ పరువు గురుంచి ఆలోచించే సమయం ఎవరికి ఉంటుంది? అందరూ వారి వారి సమస్యలతో, వారి మనస్సులలో చిక్కుకుంటారు. వారి మనస్సుల నుంచే వారు బయట పడలేక పోతున్నారు. కాబట్టి మీ గురించి ఆలోచించే సమయం వారికి ఎక్కడిది? మీ గురించి సమాజం ఏమనుకుంటుందో అని దిగులుపడటం వ్యర్థం. జీవితం ఈ కొద్దిపాటి భౌతికమైన ఆస్తుల కంటే చాలా ఎక్కువ. జీవితం కొంతమంది నుంచి పొందే మెప్పు లేదా అవమానం కంటే చాలా గొప్పది. జీవితం సంబంధాల కంటే, ఉద్యోగం కంటే చాలా ఎక్కువ.
సంబంధాలలో వైఫల్యం వచ్చినప్పుడు, ఉద్యోగంలో వైఫల్యం వచ్చినప్పుడు, అనుకున్నది సాధించలేనప్పుడు అవి ఆత్మహత్యకు కారణాలు అవుతాయి. కానీ జీవితం అంటే ఈ చిన్నచిన్న కోరికలకంటే, మీ అంతరంగంలో లేదా మనస్సులో వచ్చేవాటి కంటే చాలా పెద్దది. జీవితాన్ని విశాల దృష్టితో చూడండి. ఏదైనా సమాజ సేవ, లేదా సామాజిక సహాయ కార్యక్రమంలో పాల్గొనండి. సేవ మనుషులను మంచిగా మార్చి వారిని మానసికమైనకుంగుబాటు నుంచి బయటపడేయగలదు.
ఇక్కడ ఇచ్చిన విషయాలు వైద్య సలహాలకు, సూచనలకు, పరీక్షలకు లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మానసిక పరిస్థితిని గురించి, లేదా ఇతర సందేహాలకు మీ దగ్గరలో ఉన్న అర్హత కలిగిన వైద్యుల సలహాను తప్పక తీసుకోగలరు.