అందరికీ ఒత్తిడి నుంచి విముక్తి పొందాలనే కోరిక ఉంటుంది, అయితే, ఒత్తిడి అంటే ఏంటో తెలుసా మీకు? తక్కువ సమయంలోగానీ, తక్కువ శక్తితోగాని మితిమీరిన పని చేయాల్సివచ్చినపుడు ఒత్తిడి కలుగుతుంది. మనము తక్కువ సమయంలో చేయాల్సిన పని ఎక్కువగా ఉండి,  శక్తి తక్కువ ఉంటే మనము ఒత్తిడికి లోనవుతాము. అందుకోసం మీరు మీ పనిని తగ్గించుకోవడం లేదా సమయాన్ని పెంచుకోవడం చేయాలి, ఈ రెండూ సాధ్యం కాకపోవచ్చు. ఇక మిగిలింది ఒక్కటే – శక్తిని పెంచుకోవడం.

శక్తిని పెంచుటకు ఈ క్రింది నాలుగు సులువైన ప్రక్రియలు కలవు:

  1. సరైన మోతాదులో భోజనం చేయడం – మరీ ఎక్కువగా, లేదా మరీ తక్కువగా కాకుండా, సరిపడినంత బోజనం –  పిండిపదార్థాలు ఇంకా మాంసకృత్తులు ఉన్న సంతులిత ఆహరం.
  2. 6 నుంచి 8 గంటలు, సరిపడినంత నిద్ర – ఎక్కువా కాదు, తక్కువా కాదు
  3. దీర్ఘమైన శ్వాస ప్రక్రియలను నేర్చుకోవడం – ఇది మీ శక్తిని పెంచుతుంది
  4. కొంత సమయంపాటు ధ్యానంలో మనసును నిమగ్నం చేయటం. కనీసం కొన్ని నిమిషాలైనా దీర్ఘమైన విశ్రాంతి – చేతన అవస్థలో ఉండి తీసుకునేే దీర్ఘ విశ్రాంతిని నేను ధ్యానం అని అనగలను. కొద్ది నిమిషాలసేపు చేసే ధ్యానం వలన అన్ని రకాల ఒత్తిళ్ల నుంచి ముక్తి కలుగుతుంది. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం 15-20 నిమిషాల ధ్యానం చేస్తే చాలా మేలు జరుగుతుంది. అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.

ఒత్తిడి మొదలు కాకుండానే ఆపండి

“విలువిద్యను యుద్ధరంగంలో నేర్చుకోవటం అసాధ్యం.” అని ఒక సామెత ఉంది. మీరు ముందే విలువిద్య నేర్చుకొని యుద్ధం చేసేందుకు అర్హత సంపాదించాలి. చివరి  క్షణాల్లో నేర్చుకుందామనుకుంటే మీరు ఒత్తిడికి గురై అనుకున్నది చేయలేరు. కాబట్టి, అసలు ఆ స్థితికి చేరకముందే మీరు ఏదో ఒకటి చేసి సిద్ధం కావటం మంచిది. అప్పుడు మీరు ఒత్తిడికి లోనవ్వరు. కచేరీ చేసేందుకు వేదికనెక్కి, అక్కడ కొత్తరాగాల్ని సృష్టించడం వీలుకాదని కూడా అంటూ ఉంటారు. నేను దానిని పూర్తిగా అంగీకరించను, అదీ ఒక సామెత వంటిదే.. నిజానికి ఏదీ కూడా అసాధ్యం కాదు. నేనైతే మీ ప్రవర్తనను మార్చుకోమని చెబుతాను. మీరు ఆహారపు టలవాట్లను మార్చుకోండి. మీరు జీవితాన్ని చూసే దృష్టిని, మీ మాట తీరును మార్చుకుని, విమర్శలను తట్టుకొని నిలబడడాన్ని, విమర్శలను స్వీకరించడాన్ని అలవాటు చేసుకోవాలి. జీవితం పట్ల మీ దృక్పథమే మీలో మార్పు తీసుకు వస్తుంది. విశ్వవ్యాప్తమైన చైతన్యంతో మీరు ఎంతగా  అనుబంధం పెంచుకుంటే, మీరు పనిచేసే సామర్థ్యం అంత ఎక్కువగా పెరుగుతుంది.

ధ్యానం

రోజుకు 20 నిమిషాల చొప్పున రెండు సార్లు ఎనిమిది వారాలు అంటే దాదాపు రెండు నెలలు ధ్యానం చేస్తే మన మెదడులోని కణజాలం పెరిగి మెదడు యొక్క నిర్మాణంలో మార్పు జరుగుతుందని ఈనాడు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. మనకు ధ్యానం వలన మంచి ప్రభావం ఉంటుందని తెలుసు కానీ అది శాస్త్రవేత్తలచే నిరూపింపబడినప్పుడు, ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది ద్వారా వ్యాప్తి చెందుతున్న మన ప్రాచీన అనుభూతిని పునరుద్ఘాటించడం జరుగుతోంది. ఈనాటి ప్రపంచంలో కేవలం ఒత్తిడి మూలంగా ప్రతి 2 సెకండ్లకు 7 మందిని కోల్పోతున్నాము. ఈ పరిస్థిని మనం నివారించవచ్చు. ఒత్తిడి నుంచి విముక్తి కలగటానికి ఉన్న మార్గం గాఢమైన ధ్యానం. ఈ గాఢమైన ధ్యానంతో, ఒత్తిడి నుంచి బయటడి ప్రజలముఖాలపై తిరిగి చిరునవ్వుని తీసుకురావచ్చు.

ఒత్తిడి, విద్య

ఒత్తిడి దూకుడు స్వభావాన్ని, హింసను కలిగిస్తుంది. లేదా నిరాశను, ఆత్మహత్యా ధోరణిని కలిగిస్తుంది. దీనంతటికీ కారణం,  మన మనసుని ఎలా సంభాళించాలో మనకుఎవ్వరూ బోధించలేదు.

విద్య అంటే కేవలం సమాచార సేకరణ మాత్రమే కాదు., అది మీరు ఎవరు, మీ శక్తి సామర్ధ్యాలు ఏమిటి అని తెలుసుకునే ప్రక్రియ. ఈ ప్రక్రియలో మీరు మీ ఏడు పొరల అస్తిత్వo – శరీరము, శ్వాస, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఆత్మ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. మనకు ఈ ఆస్తిత్వపు పొరల గురించి అస్సలు తెలియకపోవడం వల్ల మన లోపలి నుంచి వచ్చే ఆవేశాన్ని లేదా కోపాన్ని ఎలా సంభాళించుకోవాలో తెలియదు. ముందే తెలిపినట్టు, ఇంట్లో కానీ పాఠాశాలలో కానీ మన మనసును, భావాలను ఎలా సంభాళించుకోవాలో ఎవ్వరూ చెప్పరు, అవి మనిషితోటే ఉండి నిరాశకు, లేదా దుడుకుతనానికి దారితీస్తాయి.

కొన్ని అధ్యాయనాల ప్రకారం పాఠాశాల ఉపాధ్యాయులలో సైతం చాలామంది కుంగుబాటుకు గురౌతున్నారని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. పాఠాలు చెప్పే గురువులే నైరాశ్యంలో ఉన్నపుడు ఇక విద్యార్థులకు ఏమి చెప్తారు? వారు నిరాశనే అందిస్తారు! ఒక సంతోషకరమైన మనిషి సంతోషాన్ని అందించగలరు, ఒక నిరాశలో ఉన్న మనిషి నిరాశనే ఇవ్వగలరు. కాబట్టి మన పిల్లలకు దుడుకుతనాన్ని కాకుండా, శాంతస్వభావాన్ని నేర్పాలి. అంటే ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆవేశపడకుండా సంభాషించటం, వారి దృష్టికోణాన్ని (దృక్పథాన్ని) విశాలం చేసుకోవటం, ఓర్మితో ఉండటం మొదలైనవి పిల్లలకు నేర్పాలి.

నాలో శాంతి, భూమి మీద శాంతి

ఈనాడు ఏమి జరుగుతోంది, మనిషి ఎప్పుడైతే ఒత్తిడికి లోనవుతాడో, అపుడు తనను తాను గాయపరచుకుంటాడు లేదా ఇతరులను గాయపరుస్తాడు. ఒక్కటి మాత్రం మీ గురించి గుర్తుంచుకోండి, మీరు ఒత్తిడికి గురై, కోపావేశంతో ప్రవర్తిస్తే, ఇతరుల మనసు గాయపడుతుంది కదా. ఇది మీ అనుభవంలో ఉన్నదే కదా. మనము మాములుగా లేనప్పుడు, విచక్షణ కోల్పోయినప్పుడు, మనము చేసే పనుల వల్ల మనతోటివారిని బాధిస్తాము. కాబట్టి, ఒత్తిడిలో ఉన్నపుడు మనము బాధపడటమో, లేక ఇతరులను బాధించటమో చేస్తాము. ఇప్పుడు ప్రపంచంలో ఇదే జరుగుతోంది. అందుచేత, సమాజంలో మరింత సంతోషాన్ని తీసుకురావడo మనందరి నైతిక బాధ్యత. కాదంటారా? ఈ జీవితానికి లక్ష్యం ఏమిటి? తోటివారికి కష్టం కలిగించే ఈ జీవితం మనము ఎందుకు బ్రతకాలి? మన జీవిత లక్ష్యం ఆనందాన్ని పంచడం. ఆనంద తరంగాలను తీసుకురండి.

ఆనందానికి రహస్యం

మీరు జీవితంలో ఏమి చేస్తున్నా సరే, అంతిమంగా దేని కోసం చేస్తున్నారు? మరింత సంతోషం కోసం, మరింత ఆనందం కోసం మరింత స్వేచ్ఛ కోసం. అంతే కదా. మనము ఒత్తిడిలో లేనప్పుడే సంతోషంగా ఉంటాము, అప్పుడే ప్రపంచాన్ని విశాలమైన దృష్టితో చూస్తాము. ఒత్తిడిని జయించడానికి మనకు జ్ఞానం కావాలి. అయితే, ఒత్తిడిని జయించాలనేే ఆలోచనతో సైతం మళ్ళీ ఒత్తిడికి లోనవుతాము. రాబోయేఒత్తిడిని నివారించడానికి ఏమి కావాలి? జ్ఞానం, విశాల దృష్టి. ఇప్పటికే మనలో ఉన్న ఒత్తిడిని పారద్రోలటానికి మనకి ఒక ప్రక్రియ అవసరం. శ్వాస, ధ్యాన ప్రక్రియలే మనకు ఉన్న ఒత్తిడి నుంచి విముక్తి పొందడానికి, ఇంకా జ్ఞానం పొందేందుకు వెసులుబాటు కలిగి రాబోయే ఒత్తిడిని అరికట్టడానికి సాధనాలు.

ఎప్పుడైతే ప్రజలమీద నమ్మకం ఉంటుందో, వారి మధ్య మాటలు బాగుంటాయి, ఆ నమ్మకం లేనప్పుడు మాటలు లేక విపత్కర పరిస్థితులు నెలకొంటాయి. కాబట్టి ఏ కుటుంబంలో ఐనా, ఎటువంటి సంబంధంలో ఐనా, వ్యాపారంలో ఐనా, లేదా రెండు దేశాల మధ్య ఐనా మనకు కావలసిందల్లా మూడే విషయాలు, మంచి మాట తీరు, మంచి మాట తీరు, మంచి మాట తీరు. అది ఒక మనసుతో మనసు, ఆత్మతో ఆత్మ, బుద్ధితో బుద్ధి మాటలాడుకోవటం. ఇదే మూడు స్థాయిలలో భావాలను వ్యక్తీకరింటం.

మీ దృష్టి కోణం మార్చండి, మీ జీవితాన్ని మార్చుకోండి

ఇప్పుడిక మీరు మేలుకోవలసిన సమయం వచ్చింది. మనము ఎప్పటికీ ఇక్కడే ఉండిపోము. మనము ఇంకో 10 – 20 – 30 – 40 ఏళ్ళు ఉండొచ్చు. మనము జీవించినంత కాలం, మనము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉండలేమా? అదే ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే, అనంత విశ్వంలోని ఉన్నతమైన శక్తితో మీకు గల సంబంధం. ఆర్ట్ అఫ్ లివింగ్ అందరిలోనూ చిరునవ్వును తీసుకు వస్తోంది. ఆర్ట్ అఫ్ లివింగ్ మనలోనూ, మన చుట్టూ ఉన్నవారిలోనూ మన అందరిలోనూ భద్రతా భావాన్ని కలిగిస్తుంది.

    Wait!

    Don't leave without a smile

    Talk to our experts and learn more about Sudarshan Kriya

    Reverse lifestyle diseases | Reduce stress & anxiety | Raise the ‘prana’ (subtle life force) level to be happy | Boost immunity

     
    *
    *
    *
    *
    *