జీవితపు మూడు స్థితులు
మెలకువ, కల, నిద్ర అనే మూడు స్థితులలో మనం జీవిస్తూ ఉంటామనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. సాధారణంగా మనం వీటిని విస్మరిస్తాము. మన కలలపై ఏమాత్రమూ శ్రద్ధ చూపము. మన గాఢ నిద్రపై దృష్టి పెట్టము, అసలు దాని గురించే ఆలోచించము. మనం వీటిని పట్టించుకుంటేనే, వీటికి అతీతంగా ఉండే నాల్గవ స్థితిని తెలుసుకోగలము. ఆ స్థితి ఇంతకు ముందు చెప్పిన మూడింటికీ భిన్నమైనది, కాని ఆ మూడు స్థితుల వెనుక అది ఉంటుంది. ధ్యానంలో దానిని అనుభూతి చెందవచ్చు.
ప్రతి రాత్రీ మనం నిద్రపోయినప్పుడు లేదా మధ్యాహ్నం ఒక కునుకు తీసినపుడు ఏమి జరుగుతుందో మనకు తెలుసా? మనం అనుభవించే నిద్రలో మూడు స్థాయిలు ఉన్నాయి. అది గాఢ నిద్ర అయితే, మనం కేవలం నిద్రపోతాం, మనకు ఏమీ తెలియదు. ఇక, తేలికపాటి నిద్ర ఒకటి ఉంది. మరొకటి కలత నిద్ర (REM నిద్ర) ఈ స్థితిలో మనం కలలు కంటాము.
మెలకువగా ఉండడం, నిద్రపోవడం అనేవి సూర్యోదయం, సూర్యాస్తమయం లాంటివి. కల అనేది వాటి మధ్యలో ఉండే సంధ్యాసమయం లాంటిది. ఇక ధ్యానం అంటే విమానం ఎక్కి అంతరిక్షంలోకి వెళ్లిపోవడం అన్నమాట! అక్కడ సూర్యాస్తమయం, సూర్యోదయం, ఏమీ ఉండవు. అంతా శూన్యం.
– గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్
మీకు మూడు శరీరాలు ఉన్నాయి
మనకు మూడు శరీరాలు ఉన్నాయని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి: అవి స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. ఆలోచనలు, భావోద్వేగాలతో తయారైనది సూక్ష్మ శరీరం. మనం కలత నిద్రలో (REM స్థితిలో) ఉన్నప్పుడు, మన సూక్ష్మ శరీరం పని చేస్తూ ఉంటుంది. ఇది స్వప్నావస్థలో (కలలు కంటున్నపుడు) పని చేస్తూ ఉండటం వలన, కలలో సైతం మీరు రంగులను చూడగలరు, సువాసనలను ఆఘ్రాణించగలరు, స్పర్శను తెలుసుకోగలరు – ఆప్యాయతతో హత్తుకున్న అనుభూతిని సైతం పొందగలరు! ఐదు ఇంద్రియాలలో దేనినీ ఉపయోగించకుండానే, మీరు వాటి అనుభవాలను పొందుతారు. మన సూక్ష్మ శరీరం స్వప్నావస్థలో పనిచేస్తూ ఉంటుంది.
మేలుకుని ఉన్నపుడు వాస్తవ ప్రపంచంలో చేసేవాటినే మనం కలలో కూడా అనుభవిస్తాము. వాస్తవ ప్రపంచం అని మనం అనుకుంటున్నాం కాని, నిజానికి ఇది కూడా వాస్తవ ప్రపంచం కాదని శాస్త్రవేత్తలు అంటారు!
అయితే గాఢ నిద్రలో ఉన్నపుడు, మనం మన శరీరపు మరొక స్థితి లేదా మూడవ భాగమైన కారణ శరీరాన్ని అనుభూతి చెందుతాము. ఈ కారణశరీరం గాఢనిద్రలో పనిచేస్తోంది. అదంతా శక్తి, దీనిలో మీరు ఏ హద్దులనూ అనుభూతి చెందరు, మీ శరీరం ఉన్నట్లే అనిపించదు. కానీ గాఢనిద్ర నుండి మేల్కొన్నప్పుడు మనకు కలిగే అనుభవం ఏమిటి? ఉత్సాహభరితంగా అనిపిస్తుంది!
మీరు మీ సూక్ష్మ శరీరంలో మాత్రమే ఉండి, రాత్రంతా కలలు కంటూ ఉంటే, నిద్రలేచేసరికి మీరు చాలా అలసిపోయినట్లు అనిపిస్తుంది. అదే మీకు గాఢ నిద్ర పట్టినట్లైతే, మీరు కారణ శరీరంతో ఉన్నారన్నమాట. అది శక్తికి, ఉత్సాహానికి, తాజాదనానికి, ఉల్లాసానికి మూలం. కాబట్టి గాఢ నిద్ర తర్వాత మేల్కొన్నప్పుడు మీరు చాలా తాజాదనంతో, శక్తివంతంగా, ఉల్లాసంగా ఉంటారు. మనం ప్రతి రాత్రీ నిద్రపోతాము కానీ నిద్రను ఎప్పుడూ కలుసుకోలేదు; మన గాఢ నిద్రతో ఏనాడూ చేయి కలిపి పలకరించలేదు; ఆ పని చేయడానికి ధ్యానం మీకు సహాయం చేస్తుంది.
ధ్యానం, నిద్ర ఒకటేనా?
ధ్యానం గాఢనిద్ర లాంటిదే కానీ గాఢనిద్ర కాదు. మీరు మరీ ఎక్కువసేపు నిద్రపోతే, మీరు మరింత అలసిపోయినట్లు అనిపిస్తుంది. మద్యపానం చేసినవారు నిద్రపోయి లేచాక ఉండే మత్తు (హ్యాంగోవర్) లాంటిదే ఇది. ఉంటుంది. బాగా అలసటగా, బద్ధకంగా ఉండి, ఏ పనీ చేయాలనిపించదు. మత్తుమందులు వాడేవారికీ ఇలాగే ఉంటుంది. (మత్తుమందులు తీసుకున్న అనంతరం) వారు భ్రమలో ఉన్నట్లుగా ఉంటారు, శక్తి పూర్తిగా క్షీణించి, నిస్సత్తువగా ఉంటారు.
ధ్యానంతో ఇలా జరగదు. మీలోని శక్తిమూలమైన కారణశరీరం నుండి శక్తిని పొందేందుకు ధ్యానం మీకు సహాయపడుతుంది. మీరు ధ్యానం నుండి బయటకు వచ్చేసరికి అది మీకు ఒకవిధమైన తన్మయత్వపు మత్తును, బలాన్ని ఇస్తుంది. ఇది ఆరోగ్యకరమైన బలం. ఇది మన రోగనిరోధక శక్తిని ఐదు రెట్లు పెంచుతుంది. ధ్యానం మన రోగనిరోధక శక్తిని పెంచుతుందని చెప్పేందుకు శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి.
ముఖ్యంగా కోవిడ్ వ్యాధి వ్యాపించిన కాలంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సంరక్షణ నిపుణులు ధ్యానాన్ని ఆశ్రయించారు. ఎందుకంటే దానివల్ల చాలా ప్రయోజనం ఉన్నదని వారు గ్రహించారు. కోవిడ్-19 వ్యాపించిన సమయంలో ఆరోగ్య సంరక్షణ నిపుణులు, వైద్య సమాజంపై విపరీతమైన ఒత్తిడి ఉంది. ముఖ్యంగా మొదటి కొన్ని నెలల్లో, వ్యాక్సిన్ రావడానికి ముందు, అసలు ఏమి చేయాలో తెలియని పరిస్థితి. రోగులకు ఏ చికిత్స, ఎలా చేయాలి? ఆ సమయంలో గురుదేవ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల కోసం రోజుకు రెండుసార్లు ధ్యానం నిర్వహించారు, వాటికి కోటి మందికి పైగా వైద్యులు, వైద్య సిబ్బంది హాజరయ్యారు. ధ్యానం అనంతరం వారు వెలిబుచ్చిన అభిప్రాయం అద్భుతమైనది; ఈ కష్టకాలంలో తమ శక్తి స్థాయిని నిలబెట్టుకోవడానికి, సేవలను కొనసాగించడానికి ఇది నిజంగా సహాయపడిందని వారు చెప్పారు.
మనకు తెలియకుండా మౌనంలోకి అలా వెళ్లిపోవడమే నిద్ర. తెలిసి, ఎఱుకతో ఉండి, మౌనాన్ని ఆశ్రయించడం ధ్యానం. ఇది మీకు మరింత శక్తిని ఇచ్చి, మీలో సూక్ష్మమైన మార్పులకు (జరిగేందుకు) అవకాశాన్నిస్తుంది.
– గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్
విముక్తికి టికెట్
మన పంచేంద్రియాల వల్లనే మనసు (ఆత్మతో) కలసిపోకుండా ఉంటుంది. ఈ ఇంద్రియాల నుండి మనసు వెనక్కు, లోపలకు వెళ్లినప్పుడు, ఏమి జరుగుతుంది? మీరు పూర్తిగా లయమైపోతారు (లయం అంటే సామరస్యంతో ఉండటం, కరగిపోవడం కూడా). నిద్రలో కూడా ఇది జరుగుతుంది. మీరు నిద్రలో ఎక్కడ ఉన్నారు? మీరు కరిగిపోయారు!
‘నేను, నాది, నాది’ అనే భావనే బంధానికి కారణం. ఈ భావన కరిగిపోయినప్పుడు విముక్తి కలుగుతుంది. మీరు ఇరవై నాలుగు గంటలూ ఈ బంధంలో ఉండలేరు. కాబట్టే మీరు నిద్రపోతారు. నిద్రలో ఉన్నపుడు మీరు ‘నేను, నా, నాది’ అనే భావాన్ని కోల్పోతారు. మీరు నిద్రపోతున్నప్పుడు ఏమిటి? మీరు ఎక్కడ ఉన్నారు? మీరు మీ పేరును, మీ గుర్తింపును కోల్పోతారు. మీ శరీరం మంచం మీద పడి ఉందని కూడా మీకు తెలియదు. మీ ప్రతీ గుర్తింపునూ మీరు కోల్పోతారు. ఇది శ్రీశ్రీ రవిశంకర్ నిద్ర అని, వేరెవరూ దీన్ని తీసుకోలేరని మీరు చెప్పలేరు. నిద్ర అంటే నిద్రే. అక్కడ శ్రీశ్రీ లేడు, రవిశంకర్ లేడు. ఎవరూ లేరు – నామరూపాలు లేవు. కేవలం నిద్ర. అంతే.
మరో పక్క, ధ్యానం అంటే ఎఱుకలో, స్పృహలో ఉంటూ నాలోని ‘నేను’ అనే భావనను కరిగించివేయడం; ‘నేను’ అనేది తన ఉనికిని కోల్పోయినప్పుడు, అది స్వేచ్ఛ; అది విముక్తి.
నిద్ర విషయానిక వస్తే, రోజంతా కష్టపడి అలసిపోయిన వ్యక్తికి, అక్కడ దోమలు ఉన్నాసరే, బాగా నిద్ర పడుతుంది. నిద్రను ఆస్వాదించాలంటే చాలా కష్టపడాలి. ఈ ప్రపంచంలో మనం వ్యతిరేక విలువలను ఒకదాని తరవాత ఒకటిగా మాత్రమే ఆస్వాదించగలం, కానీ సమాధి స్థితిలోని ఆనందం (దీనికంటే) చాలా గొప్పది. ధ్యానం మిమ్మల్ని వ్యతిరేక విలువలకు ఆవలగా తీసుకెళ్తుంది.
యోగ నిద్ర (NSDR: నాన్-స్లీప్ డీప్ రెస్ట్ – నిద్రపోని, గాఢమైన విశ్రాంతి స్థితి)
ప్రకృతి, మీకు తెలియకుండానే మిమ్మల్ని నిశ్శబ్దంలోకి వెళ్ళేలా చేస్తుంది. అది నిద్ర. నిద్ర మీకు శక్తిని ఇస్తుంది. ఈరోజుల్లో, చాలా ఎక్కువ కలలు కనడం, చాలా పనులు చేయాలనుకోవడం నిద్రలేమికి కారణమయ్యాయి. “నాకు ఏమీ వద్దు. నేను ఏమీ చేయను.” అనే రెండు విషయాలను దృష్టిలో ఉంచుకుంటే మీరు శిశువులా నిద్రపోగలరు.
స్పృహతో నిద్రపోవడమే యోగ నిద్ర. మీకు నిద్రపోవడంలో సమస్య ఉంటే, మీరు యోగ నిద్రను ప్రయత్నించవచ్చు. నిద్ర కోసం ఒక ఆన్‌లైన్ యోగా కోర్సు కూడా ఉంది. దానిని నేర్చుకోవచ్చు. మీరు ఆందోళన, నిద్రకు సబంధించిన సమస్యల నుండి బయటపడటానికి మరింత సమాచారాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వర్క్‌షాప్‌లో తెలుసుకోవచ్చు.
ధ్యానం సమయంలో నిద్రపోవటం
ఒక శ్రోత గురుదేవ్‌ను ఈ క్రింది ప్రశ్న అడిగారు: ధ్యానం చేస్తున్నపుడు నిద్రపోవడం సరైనదేనా?
దానికి గురుదేవులు ఇలా జవాబిచ్చారు: మీ గురకతో ఇతరులను ఇబ్బంది పెట్టకపోతే ఫర్వాలేదు! ధ్యానం అంటే గాఢమైన విశ్రాంతి. సమాధి అంటే ఏమిటి? అది పదిలక్షల సంవత్సరాల విశ్రాంతికి సమానం. మీరు ఒక సెకను పాటు ధ్యానం చేసి, దానికి ముందు, ఆ తర్వాత నిద్రపోయినా, మరేం పర్వాలేదు.











