మొట్టమొదటగా మీకు ఒత్తిడి అంటే తెలుసా? ఎపుడైతే చేయవలసింది చాలా ఉండి, కావలసినంత సమయం, శక్తి మనదగ్గర ఉండదో అపుడు ఒత్తిడి కలుగుతుంది.
దానిని ఎదుర్కొనేందుకు మన శక్తిస్థాయిని ఎలా పెంచుకోవాలో ఇపుడు చూద్దాము.
- మరీ ఎక్కువ, లేదా మరీ తక్కువకాకుండా సరైన మొత్తంలో ఆహారం తీసుకోవడం
- 6-8 గంటలు ఎక్కువ, తక్కువ కాకుండా సరైన మోతాదులో నిద్ర
- శ్వాసకు సంబంధించిన కొన్ని వ్యాయామాలు నేర్చుకోవడం – ఇవి మీ శక్తి స్థాయిలను పెంచుతాయి.
- కొద్ది నిమిషాలపాటు చేసే ధ్యానం అన్ని రకాల ఒత్తిడులనుండి ఉపశమనాన్ని ఇస్తుంది. ఉదయం, సాయంత్రం 15-20 నిమిషాల పాటు ధ్యానము చేయగలిగితే అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.
ప్రతి ఒక్కదానికీ ఎల్లప్పుడూ మొదటిసారి అనేది ఉంటుంది. కానీ మీరు ఒత్తిడిని ఫీలవ్వడం ఇదే మొదటిసారి కాదుకదా.
గతంలో మీరు ఒత్తిడికి గురైన క్షణాలలోకి ఇపుడు, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ సమయంలో ఇక ప్రపంచం అంతమేమో అన్పించింది. కానీ మీరు ఆ క్షణాలను దాటుకుని వచ్చారు, ఇప్పటికీ సజీవంగా ఉన్నారు. గతంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారని, వాటిని అధిగమించారని గుర్తుంచుకోడి. కాబట్టి మీరు ఈ సవాలును కూడా అధిగమించగలరని నమ్మకం ఉంచుకోండి.
మీ దృష్టిని విస్తృతపరచుకోండి. ఈ ప్రపంచంలోని సంఘటనలన్నీ ఒక భిన్నమైన న్యాయంతో జరుగుతాయి.
మీరు ఎంత మంచిగా ఉన్నా సరే కొన్నిసార్లు ఆకస్మాత్తుగా ఎదుటివారు మీకు శత్రువులుగా మారడం గమనించే ఉంటారు. మీ స్నేహితులు మీకు శతృవులుగా మారతారు. దీనికి విరుద్ధంగా కూడా జరగవచ్చు. మీరు కొంతమందికి ఎక్కువ అనుకూలంగా ఉండకపోయినా, వారు మీకు అవరమైనపుడు సహాయపడతారు. ఈ ప్రపంచంలో స్నేహంకానీ, శతృత్వం కానీ ఒక ప్రత్యేకమైన న్యాయాన్ని అనుసరించి కలుగుతాయి. దాన్నే కర్మ అంటారు. మీ సమయం బాగున్నప్పుడు బద్ధశత్రువు కూడా స్నేహితుడిలాగా ప్రవర్తిస్తాడు. జరుగుతున్న వాటిని విశాలమైన పరిధిలో అర్థం చేసుకోండి. ఓపికతో ఉండండి. ఈ చెడు సమయం కూడా గడచిపోతుంది.
వేచి ఉండండి. ఇది కూడా దాటిపోతుంది.
నిరాశ చెంది ఉండటం వల్ల దీనిని కొన్నిసార్లు వదిలేద్దామా అని అన్పిస్తుంది. ఒత్తిడివల్ల అలా జరుగుతుంది. ఒతిడిలో ఉన్నప్పుడు, నిరాశ చెంది ఉన్నప్పుడు ఏ నిర్ణయాలూ తీసుకోకండి. మీరు పశ్చాత్తాప పడవలసి వస్తుంది. మీ పూర్వపు స్థితికి తిరిగి రండి. మీతో మీరు గడపడానికి సమయం ఇవ్వడం కూడా ఒత్తిడినుండి విశ్రాంతిని ఇస్తుంది.
కొద్దిసేపు నడవండి. విశ్రాంతిగా కూర్చుని, సూర్యాస్తమయాన్ని గమనించండి.
కొన్నిపట్టణాలలో చుట్టూ ఉన్న ఎత్తైన భవనాలవల్ల సూర్యాస్తమయాన్ని చూడడం కుదరకపోవచ్చు. కానీ సాధ్యమైనంత వరకు ప్రకృతితో ఉండడం, పిల్లలతో ఆడడం మొదలైనవి ఒత్తిడినుండి బయటపడటానికి సహాయం చేస్తాయి. దురదృష్టం ఏమంటే, మనం ఇవేమీ చేయకుండా, సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ చిరుతిండ్లు తింటున్నాము. ఇది సమాజపు ఆరోగ్యానికి నష్టాన్ని కలుగజేస్తుంది. ఆరోగ్యకరమైన సమాజంకొరకు మనం మన పద్ధతులను మార్చుకోవలసిన అవసరం ఉంది.
చివరిగా
చెప్పేదేమంటే ఒత్తిడి మొదలవకముందే రాకుండా చూసుకోవడం మంచిది
“యుద్ధభూమిలో విలువిద్య నేర్చుకోలేవు” అనే సామెత ఉంది కదా. యుద్ధంలో పోరాడటానికి వెళ్ళకముందే విలువిద్య నేర్చుకోవాలి. ఒత్తిడితో ఉన్నపుడు విశ్రాంతి పొందడానికి ఏమైనా చేయాలంటే కష్టం కానీ మీరు ఆ స్థాయికి చేరకముందే ఏదైనా చేయగలిగితే ఒత్తిడి చెందకుండా ఉండవచ్చు.
కాబట్టి ఒత్తిడి నుండి విముక్తి పొందాలంటే మీ ప్రవర్తనా విధానం, ఆహారపు అలవాట్లు, జీవితంలో జరిగిన సంఘటనలను అవగాహన చేసుకునే పద్ధతి, భావవ్యక్తీకరణ నైపుణ్యం, విమర్శలను తట్టుకొని నిలబడగలిగే సామర్థ్యం… సాధారణంగా జీవితంపట్ల మీ దృక్పథం ఇవన్నీ చాలా వ్యత్యాసాన్ని తీసుకొస్తాయి.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ హ్యాపీనెస్ ప్రొగ్రాముకి మూలస్తంభమైన సుదర్శనక్రియ ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందికి ఒత్తిడిని తగ్గించడంలో, మెరుగైన విశ్రాంతి పొందడంలో, జీవన నాణ్యతను మెరుగుపర్చడంలో సహాయపడింది. సుదర్శనక్రియ చేయడం వలన కలిగే లాభాలు, ముఖ్యంగా కార్టిసోల్ అనే ఒత్తిడి హార్మోన్ ని తగ్గించి మొత్తంగా జీవితంలో తృప్తిని ఎలా మెరుగుపరుస్తుందో, ప్రపంచవ్యాప్తంగా నాలుగు ఖండాలలో సమగ్ర అధ్యయనాలు నిర్వహించి సుప్రసిద్ధ పత్రికలలో యేల్, హార్వర్డ్ విశ్వవిద్యాలయాల పరిశోధనా పత్రాలలో సైతం ప్రచురించారు.