కార్పొరేట్ ప్రపంచంలో కాలానుగుణంగా ఎదురౌతున్నసవాళ్ళపెరుగుతున్న పని ఒత్తిడి ప్రభావాలు చాలమందికి అనుభవంలోకి వస్తున్నాయి. ఒత్తిడి మన ఆలోచనా విధానాన్ని, అనుభూతులను, మన ప్రవర్తనను, తద్వారా మన జీవితంలో అన్ని అంశాలనూ ప్రభావితం చేస్తుంది. ఒత్తిడికి లొంగిపోయి జీవిస్తే కలిగే పరిణామాలు, వినాశకర, విషాద సంఘటనల ఫలితాకంటే తక్కువేమీ కాదు. కాబట్టి ఈ అధిక ఒత్తిడి అనే భారీమూల్యం చెల్లించకుండానే, జీవితాన్ని విజయవంతంగా గడపటం ఎలా? అనే ప్రశ్న ఈరోజుల్లో ప్రతీఒక్కరూ అడుగుతున్నారు. దీనికి సులభమైన, సరళమైన సమాధానం ఉంది.
అది సైకిల్ తొక్కడం లాంటిది
సైకిల్ తొక్కడానికి రహస్యం ఏమిటి? ‘సమతౌల్యం (బ్యాలెన్స్ చేసుకోవడం)’. కుడివైపు లేదా ఎడమవైపుకు పడిపోకుండా మధ్యలో ఉండడం. ఏ పక్కకైనా ఒరిగిపోతుంటే మీరు దాన్ని మధ్యకు తీసుకొస్తారు. (అదే విధంగా) సమతుల్య స్థితి నుండి ప్రక్కకు జరిగినపుడు, వెంటనే మీకు ఆ తేడా తెలుస్తుంది. దాన్ని వినండి. పట్టించుకోకుండా వదిలేయకండి. దాన్ని గుర్తించి, తిరిగి కేంద్రం వద్దకు రండి. ఎప్పుడైనా మీ జీవితంలో ఎప్పుడైనా ఏ అంశంలోనైమా సమతుల్యత తప్పినట్లైతే మీ అంతరాత్మ చెప్పే మాటల్ని వినండి. విని, మరలా మీ కేంద్రంలోకి రండి.
నిజమైన విజయం యొక్క రహస్యం ఏమంటే, జీవితంలోని అన్ని అంశాలనూ, ఏ ఒక్కదానితోనూ అనుబంధం లేదా విముఖత పెంచుకోకుండా సమతుల్యం చేసుకోవడమే.
– గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్
పునరుత్తేజం పొందడం పట్ల శ్రద్ధ చూపండి
మొదటగా మీరు చేసే పనికి (ఉద్యోగానికి), విశ్రాంతికి కేటాయించే సమయాన్ని సమతుల్యం చేసుకోండి. మీ ఆహారం, వ్యాయామం పట్ల శ్రద్ధ వహిస్తూ, ధ్యానానికి, విశ్రాంతికి కొంత సమయం ఉంచుకోండి. మీరు పని చేసే ప్రదేశాలలో మధ్యాహ్నం భోజనానికి ముందు ధ్యానం చేస్తే మంచిది. ఎప్పుడైతే ప్రజలంతా ఒకచోట కలిసి కూర్చుని కొన్ని నిముషాలు ధ్యానం చేసి, అంతా కలసి భోజనాన్ని పంచుకున్నపుడు, వారికి తాజాగా అనిపించి, ఉదయాన్నే ఎంత ఉత్సాహంగా వచ్చారో, అంతే శక్తిని, ఉత్సాహాన్ని సాయంత్రం వరకూ కలిగి ఉంటారు.

కళ మిమ్మల్ని కళకళలాడేలా చేస్తుంది
రెండవది, ఏదో ఒక కళలో ఆసక్తి ఏర్పరచుకోండి. కార్పొరేట్ ప్రపంచంలో (ఉద్యోగాలలో) తార్కిక ఆలోచన, ప్రణాళికలు చేయడం, విశ్లేషించడం లాంటి పనులు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఎడమమెదడుతో చేసే పనులు. కాబట్టి మీరు వాటికి కుడి మెదడుతో చేసే పనులను కొన్ని చేర్చి, సమతుల్యం చేయవలసిన అవసరం ఉంది. పెయింటింగ్, సంగీతం, కవిత్వం లాంటి ఏదో ఒక సృజనాత్మకమైన, ఆహ్లాదాన్నిచ్చే కార్యకలాపాలు కుడి మెదడును ఉత్తేజపరుస్తాయి. ఎప్పుడైతే మెదడు యొక్క రెండు అర్థగోళాలు సమతుల్యంగా ఉంటాయో అప్పుడు మీరు ఉత్తమమైన స్పష్టత, సృజనాత్మకత, ఉత్పాదకత, నైపుణ్యతలను, విశ్రాంతిని అనుభవిస్తారు.
జీవితాన్ని, పనిని సమతుల్యం చేసుకోండి
మూడవది, పనికి, జీవితానికి మధ్య సమతుల్యతను సాధించడం. మీ అంతంగం చెప్పే మాటల్ని వినండి. మీ కుటుంబాన్ని పట్టించుకోకపోతే అది మిమ్మల్ని బాధ పెడుతుంది. సామాజిక నిబద్ధతను పట్టించుకోకపోయినా, అది కూడా మిమ్మల్ని బాధిస్తుంది. మీ ఉద్యోగాన్ని లేదా వ్యాపారాన్ని పట్టించుకోకపోతే అదీ బాధ కలిగిస్తుంది. మీ ఆధ్యాత్మిక కార్యక్రమాలను పట్టించుకోకపోయినా, అది కూడా మీకు బాధగా ఉంటుంది. కాబట్టి మీకు ఎక్కడ నొప్పిగా అనిపించినా, ఒకసారి మీ (అంతరంగానికి) కేంద్రానికి తిరిగి రండి.
సేవ ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోండి
నాలుగవది, కొంత (సమాజ) సేవ చేయండి. మీ చుట్టుప్రక్కలవాళ్లకి సహాయపడండి. ఇది ఒత్తిడికి ఉత్తమమైన విరుగుడు. సమాజానికి దోహదపడే పనులను మనం తప్పక చేయాలి. ఎప్పుడైతే మీరు సేవాభావం, దయ కలిగిన పనులు చేస్తారో, ఆ వెంటనే మీకు అంతతర్గతంగా ఉత్తేజకరమైన అనుభూతి కలుగుతుంది.
అసమగ్రతకు కూడా కొంచెం చోటు ఉంచండి
చివరగా, అసమగ్రతకు, అసంపూర్ణతకు చోటు కల్పించండి. ఇరులలో ఉన్న అసంపూర్ణతలను, అదేవిధంగా మీలో ఉన్న అసంపూర్ణతలను కూడా అంగీకరించండి. అది మీలో ఓర్మిని పెంపొందిస్తుంది. మీ ఇంట్లో చెత్తబుట్టను ఉంచడం లాంటిదే ఇది. ఇల్లంతా పరిశుభ్రంగా ఉండాలంటే, ఇంట్లో ఒక మూల చెత్త బుట్ట ఉండటం అవసరం కదా.











